అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఢిల్లీ అంతటా ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగుస్తుండటంతో ఆలోపే నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు ఖండించిన సీఈసీ
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు సీఈసీ రాజీవ్‌కుమార్ ఖండించారు. ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని, ఈవీఎంల రిగ్గింగ్ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన తెలిపారు. ఈవీఎంల రిగ్గింగ్ సాధ్యం కాదని చెప్పారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్ మీట్ అని సీఈసీ చెప్పారు. ఓటింగ్ శాతంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై కూడా సీఈసీ స్పందించారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు.
జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై క్లారిటీ ఇచ్చారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.