ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 86 ఏళ్ల ఆశారాంకు వైద్యకారణాలతో జోధ్‌పూర్ అత్యాచారం కేసులో 2025 మార్చి 31 వరకు బెయిలుపై విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. బెయిలుపై బయటకు వెళ్లాక సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన అనుచరులను కలవకూడదని..న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ఆశారాంను ఆదేశించింది.
జోధ్‌పూర్ జైలుకు వచ్చిన ఆశారాం
డిసెంబర్ 18, 2024న నుంచి 17 రోజుల పెరోల్ పూర్తయిన తర్వాత ఇటీవల జనవరి 2న మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలుకు తిరిగి వచ్చాడు ఆశారాం. పెరోల్‌పై విడుదలైన సమయంలో పూణేలో ఉంటూ వైద్య చికిత్స చేయించుకున్నాడు. స్వయంగా తాను దైవమని ప్రకటించుకున్న ఆశారాం అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలానీ.. రెండు రేప్ కేసుల్లో దోషిగా రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.