హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అని ఎద్దేవా చేశారు. అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలవుతున్నది ఒకే ఒక్క గ్యారంటీ.. అది మోసం అంటూ ఫైరయ్యారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి సంబంధించిన నిరసన సెగ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తాకిందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌ను ఎలా అమలుచేస్తున్నారో వివరించేందుకు తెలంగాణకు ఎందుకు రావడం లేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
రైతు భరోసాపై తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సందర్భంగా రైతు భరోసాగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఇప్పుడు దానిపై కాంగ్రెస్ యూ టర్న్ తీసుకున్నదని పేర్కొన్నారు. 2024లో రైతులకు పెట్టుబడి సాయంగా విడుదల చేసింది గుండు సున్నానే అంటూ రాశారు. ఎకరాకు రూ.12 వేలు ఇస్తామంటూ రూ.15 వేలపై సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారని పోస్టర్లలో తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.