పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్న NDA ప్రభుత్వం, బెంగాల్‌లో జరగే గంగాసాగర్ మేళాకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గంగాసాగర్ మేళా కూడా ఎంతో ప్రాముఖ్యమున్న పుణ్యక్షేత్రమని, దీనికి సరైన మౌలిక సదుపాయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.
గంగాసాగర్ మేళా గంగానది, బంగాళాఖాతం కలిసే ప్రదేశంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్యస్నానం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే, ఈ ప్రదేశానికి సరైన రవాణా సౌకర్యాలు లేవని, ముఖ్యంగా నీటిమార్గం ద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుందని మమతా బెనర్జీ చెప్పారు.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఆమె అన్నారు. గంగాసాగర్ ప్రాంత అభివృద్ధి పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని, తాము స్వయంగా తమ ప్రభుత్వ నిధులతోనే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని మమత తెలిపారు. ఇది భక్తులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.
కుంభమేళాకు కేంద్రం వేల కోట్ల నిధులు కేటాయిస్తే, గంగాసాగర్ మేళాకు కనీసం ప్రాథమిక సదుపాయాలు అందించకపోవడం అన్యాయం అన్నారు. గంగాసాగర్ మేళా కూడా దేశానికే గర్వకారణమైన ఆధ్యాత్మిక పండుగ అని, దీనికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.