హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ సమాధానం పంపారు.
గత వారం కిందట ఫార్ములా-ఈ రేస్ వ్యవహారం కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 7న విచారణకు రావాలని కోరింది. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 2, 3న విచారణకు రావాలని అరవింద్, బీఎల్‌ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించగా.. హాజరయ్యేందుకు గడువు కోరారు.
కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పును వెలువరించనున్నది. ఫార్ములా-ఈ రేస్‌లో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే హైకోర్టు ఇరువర్గాల వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, తీర్పును వెలువరించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.