రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంతో మరణించారు. దీంతో చిత్ర బృందం తరఫున చెరో 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మరణించిన ఘటనపై పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పుష్పకేమో నీతులు చెప్తారా? గేమ్‌ఛేంజర్‌కి పాటించరా అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించారు.
అంతకుముందు గేమ్‌ఛేంజర్ ఈవెంట్ సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదంటూ గేమ్‌ఛేంజర్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
‘ సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పనేంటి? హీరోలు ఎందుకు రావాలి? అలా హీరోలని రప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చినా టిక్కెట్ల ధరలు పెంపు ఇస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లో లెవల్ వ్యక్తులం కాదు. మేము స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన్ని ఎంతమంది విమర్శించినా కలసి నటించేప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలుకరించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కృష్ణ లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం అది.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున చెరో 5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.