Headlines
gottipati

అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కుప్పం: గొట్టిపాటి

కుప్పంలో ప్రతీ ఇంటిని ఓ విద్యుదుత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో 53,314 విద్యుత్ కనెక్షన్లు త్వరలోనే సౌర విద్యుత్‌తో అనుసంధానం కానున్నాయన్నారు. సుమారు 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఒక నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహ విద్యుత్ కనెక్షన్లను సౌర వ్యవస్థతో అనుసంధానించడం ఇదే తొలిసారి అని అన్నారు.

పైలట్‌ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గాన్ని ఎంచుకుని ప్రారంభించామన్నారు. పీఎం సూర్యఘర్ (ఇంటిపై) ద్వారా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చని చెప్పుకొచ్చారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్‌ను అనుసంధానం చేయవచ్చన్నారు. అధికంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నామన్నారు.

ఈ పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం 60 శాతం, ఏపీ ప్రభుత్వం 40 శాతం ఖర్చు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. పీఎం సూర్యఘర్‌లో తాము చేరడం లేదంటూ జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు.

కాగా.. కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సూర్యఘర్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. సొంత నియోజకవర్గంలో కుప్పంలో ప్రయోగాత్మకంగా సూర్యఘర్‌ను లాంఛనంగా ప్రారంభించారు సీఎం. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్తు కనెక్షన్లు కలిగిన 50వేల గృహాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *