Headlines
vijayasai reddy

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈడీ ఆఫీసులో విచారణకు ఎంపీ హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హాయంలో కాకినాడ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ.3600 కోట్ల విలువైన షేర్లను కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. మనీలాండరింగ్‌ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు విజయసాయి హాజరుకాలేదు.

దీంతో తాజాగా మరోసారి ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు విచారణకు రావాల్సింది ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి, ‘అరబిందో’ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు రాలేని విక్రాంత్‌రెడ్డి సమాచారం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *