గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రభుత్వం నడుస్తోందన్నారు. 6 గ్యారంటీల్లో రెండు అమలు చేశామని, మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ తెలిపారు.
ముందుగా తల్లికి వందనం, రైతు భరోసా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై కీలక చర్చ జరిగింది. ఇందులో తల్లికి వందనం, రైతు భరోసా ముందుగా అమలు చేయాలని, ఆ తర్వాతే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
మంత్రి నారా లోకేష్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఉండి, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉండి హైస్కూల్ అభివృద్ధి పనుల్ని లోకేష్ ప్రారంభించారు. అలాగే కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.