తెలుగు దేశం భారీమెజార్టీతో గెలుపు పొందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు కొత్త వరాలు ప్రకటించనున్నారు. ఈ రోజు నుంచి తన సొంత నియోజక వర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ‘స్వర్ణ కుప్పం’ విజన్-2029′ డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పీఎం సూర్యఘర్ పథకం పైలెట్ ప్రాజెక్టు కుప్పంలో అమలు చేయనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు కుప్పంకు కొత్త వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
లబ్ధిదారులతో ముఖాముఖి
విజన్ ఆవిష్కరణ కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం12.00 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరిస్తారు. 2.25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్‌ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.
సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామం చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటిస్తారు. పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సౌర పలకాలు అమర్చాలని నిర్ణయించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద కుప్పంలోని ప్రజలకు వంద శాతం రాయితీతో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తును అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు.