అప్పటివరకు ఎంతో హ్యాపీగా వున్న వారిద్దరూ విగతజీవులుగా మారిపోయారు. కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగిల్చారు. ఎంతో భవిష్యత్తు వున్నవారు కనుమరుగై పోయారు. ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. దీనితో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) శనివారం రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరిగిన రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బైక్‌పై వచ్చారు. అయితే, అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి కాకినాడ బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 9.30 గంటల సమయంలో వడిశలేరులో ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే 108 వాహనంలో పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంసభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.