ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు హాజరుకానున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు. ఈ రోజు చంద్రబాబు కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ‘స్వర్ణ కుప్పం విజన్-2029’ అనే డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు. ఈ డాక్యుమెంట్ ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన విధానాలను ప్రకటించనున్నారు. ఇది స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అదే విధంగా కుప్పం మండలంలోని నడిమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలెట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇళ్లపై సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, గృహాలకు విద్యుత్ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టు కుప్పం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడానికి దోహదం చేస్తుందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రేపు కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
సొంత నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు ఈ పర్యటన ద్వారా నియోజకవర్గ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవ్వడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.