ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్న వైసీపీ నాయకుల అవినీతి చిట్టాను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలు నోటీసులు జారీ చేసినప్పటికీ వివిధ కారణాలతో ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ.. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కాకినాడ సీ పోర్టు లిమిటెడ్, సెజ్‌లో కర్నాటి వెంకటేశ్వర రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవీ రావు ఫిర్యాదును పరిశీలించిన ఈడీ.. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది.
ఈమేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు పలు కారణాలతో విచారణకు హాజరుకాలేనంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక తాజా నోటీసుల నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.