ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో ఏపీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేయనున్నారు.
ఉద్యోగుల పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) తో పాటు మధ్యంతర భృతిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ నిర్ణయాలను జనవరి 2న జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ఉంచనున్నారు. ఈ నిర్ణయాలతో ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు. ఈ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో జరుగనుంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో జరగనున్న ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా, సంక్రాంతి కానుకల కింద ఉద్యోగులకు సకాలంలో డీఏలు అందించడంపై ప్రభుత్వ మంత్రులు మరియు ఉన్నతాధికారులు అభిప్రాయాలను పంచుకుంటారు.
ఉద్యోగుల పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొత్త పీఆర్సీ అమలుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగకు ముందే ఈ నిర్ణయాలు ప్రకటించి, ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ఉత్సాహం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.