ఏపీలో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయంతో, పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలామంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలకమైన నేతలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది బయటకు వచ్చి టీడీపీ , జనసేన లలో చేరగా..తాజాగా గంజి చిరంజీవి మరియు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీని వీడి, జనసేన పార్టీలో చేరారు.
పవన్ కల్యాణ్ నేతృత్వంలో మంగళగిరి జనసేన కార్యాలయంలో వీరిని ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో గంజి చిరంజీవి, జయమంగళ వెంకటరమణ జనసేన కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేనలో వీరు చేరడం ద్వారా పార్టీకి మరింత బలం పెరిగినట్లు అయ్యింది.
జయమంగళ వెంకటరమణ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన కైకలూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. ఆయన రాజీనామా చేసి, మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు. అదే సమయంలో గంజి చిరంజీవి మంగళగిరి ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన ఆప్కో చైర్మన్‌గా కూడా పని చేశారు. ఈ ఇద్దరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం, పార్టీకి కొత్త శక్తి ఇస్తుందని భావిస్తున్నారు.