పీఎస్ఎల్వీ-60 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకున్నదని ఆయన కొనియాడారు. ఇస్రో విజయం ప్రతిసారి దేశ గర్వానికి కారణమవుతోందని పేర్కొన్నారు.
స్పేస్‌ఎక్స్ మిషన్ విజయవంతం కావడం భారత అంతరిక్ష సామర్థ్యానికి మరో నిదర్శనమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రోదసి శాస్త్రంలో ఆర్బిటల్ డాకింగ్ వంటి సాంకేతికతలకు ఇది బలమైన పునాది అని తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా మనుషుల రోదసి ప్రయాణాలు, ఉపగ్రహాల మరమ్మతులకు భారత్ మరింత దగ్గరైందని ఆయన అన్నారు.
ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతోందని, ఈ విజయాలు సమష్టి కృషికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం అనంతరం భారత్ చంద్రయాన్-4, స్పేస్ స్టేషన్ వంటి కీలక ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టగలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విజయాలు భారత్ అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు మార్గం సుగమం చేస్తున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ట్విటర్ ద్వారా తన అభినందనలు వ్యక్తం చేస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. ఇస్రో విజయం ద్వారా యువతకు కొత్త ఆశలకిరణం లభిస్తోందని, ఈ ప్రయోగాలు అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్టను పెంచుతున్నాయని అన్నారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Centre) నుంచి పీఎస్‌ఎల్వీ- సీ 60 నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటల 15 సెకండ్లకు నిప్పులు చిమ్ముతూ మొదటి ప్రయోగవేదిక నుంచి దూసుకెళ్లింది.
స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.