ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సభ్యుడిగా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీంతో రాజీవ్ రంజన్ మిశ్రా నేడు గుంటూరు కలెక్టరేట్ లో అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రాలు అందించారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. త్వరితగతిన వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఆయా కులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా మేలు చేసేందుకు చంద్రబాబు ముందుకొచ్చారని తెలిపారు.
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ… మాదిగలు రిజర్వేషన్ ఫలాలను తక్కువగా పొందుతున్నారని వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేయడమే న్యాయబద్ధం అని స్పష్టం చేశారు. దీనిపై మాలలు, మాదిగలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు.