ఇటీవల కాలంలో నాగబాబుకు మంత్రి పదవిపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ… ‘‘మనతో ప్రయాణం చేసి, పని చేసిన వారిని నేను గుర్తించాలి నాగబాబు నాతో పాటు సమానంగా పని చేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కొసం నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పనిమంతుడా కాదా అనేదే ముఖ్యం. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం. మనోహర్, హరిప్రసాద్‌లు మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారు.
రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం
ఇదే విషయంలో జగన్‌ను మీరెందుకు అడగలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌ను మాత్రమే అడుగుతారు. మాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తరువాతతరం పిల్లలకు ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం.
అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అనిచెప్పుకొచ్చారు. ముందు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాకనే మంత్రి పదవి గురించి ఆలోచిస్తానని అన్నారు. ఎక్కడో ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందు మంత్రి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఇప్పుడు అంత ప్రత్యేక పరిస్థితులు ఏమి లేవన్నారు.