ఆంధ్రప్రదేశ్‌లో నూతన సంవత్సరం వేడుకలపై పోలీసులు కఠినమైన ఆంక్షలను విధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ ఆదేశాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పబ్బులు, క్లబ్బులు, ఇతర ప్రదేశాల్లో ఆమోదిత సమయానికి మించి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించారు. అర్ధరాత్రి కేక్ కటింగ్, మద్యం సేవించడం వంటి కార్యకలాపాలు నిషేధించబడతాయని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల సమయంలో అశ్లీల నృత్యాలు, డీజేల విన్యాసాలు నిర్వహించడంపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినోద కార్యక్రమాల పేరుతో అసభ్య ప్రదర్శనలకు తావు ఇవ్వొద్దని సూచించారు. అలాగే వేగంగా బైక్, కార్ రేసులు నిర్వహించడంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. రోడ్లపై రద్దీని పెంచి, ప్రమాదాలకు కారణం అయ్యే రేసింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రోడ్డు భద్రతను కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా గస్తీ పెంచారు.
రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఎవరికైనా అనుమతులు అవసరమైతే ముందస్తుగా తీసుకోవాలని సూచించారు. పోలీసు ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.