వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు. జనసేనలో చేరుతున్నారన్న ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. “నేను వైసీపీలోనే కొనసాగుతాను. జనసేనలో చేరాల్సిన అవసరం నాకు లేదు” అని తమ్మినేని సీతారాం అన్నారు. ఈ విషయంపై మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తమ్మినేని తన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్లు వివరించారు. ఇది తాను పార్టీ మారుతున్నానని భావించకూడదని అన్నారు.
ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి. నేను వైసీపీకి నిబద్ధుడిని. నా కుటుంబ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా రాజకీయాలకు విరామం తీసుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్‌ను పార్టీ నియమించడం వల్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వైసీపీ అంతర్గత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ్మినేని దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా, తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించలేదు.