వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎటువంటి వ్యక్తిగత కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వానికి కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పు చేస్తే వారు న్యాయ ప్రక్రియకు లోబడాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. నాని సంబంధించిన గిడ్డంగుల కేసుపై వివరణ ఇచ్చిన నాదెండ్ల, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు.
‘నాని గిడ్డంగు తన భార్య పేరిట తీసుకోవడం ఎందుకు? గిడ్డంగు తనిఖీల అనంతరం నోటీసులు పంపినా, ఆయన స్పందించకపోవడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరంగా తాము న్యాయమార్గంలోనే చర్యలు తీసుకుంటున్నామని, రాజకీయ కక్షతో కాదు అని ఆయన అన్నారు. పేర్ని నానిపై నమోదైన కేసులు ఆయన చేసిన తప్పుల కారణంగానే అని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. ఎవరైనా వారి పేరిట గిడ్డంగు ఉంటే, వారి మీదే కేసులు నమోదవుతాయి. ఇక్కడ ఎవరికీ ప్రత్యేక ట్రీట్మెంట్ లేదు అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనపై కూడా నాదెండ్ల తీవ్ర విమర్శలు చేశారు. ‘YSRCP ఐదేళ్లపాటు అరాచక పాలన సాగించింది. ప్రజాస్వామ్య విలువలను పక్కదోవ పట్టించింది. ఇప్పుడు మేము వచ్చాక, ప్రజలకు న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.