తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుంది అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యన్.వి.రమణ పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు. వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని.. తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు.
ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ఇచ్చే ఆలోచన చేయాలి.
మాతృభాషలో విద్యాబోధన
కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని వెల్లడించారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయన్నారు. భవిష్యత్తుతరాలకు మాతృభాషపై ఒక గౌరవం కలిగించాయన్నారు.
ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అనే పరిస్థితి కల్పించారు. తెలుగు భాషలోచదివి… దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో. ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి.
ఎన్టీఆర్ కే ఆ ఘనత
ఎన్టీఆర్ వంటి వారి వల్ల మన భాషకు, మన తెలుగు వాళ్లకు గౌరవం పెరిగిందన్నారు. మానవ బంధాలతో కూడిన రచనలే కలకాలం ప్రజల్లో నిలుస్తాయని.. కన్యాశుల్కం వంటి రచనలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడాలని.. లేదంటే భవిష్యత్తులో తెలుగు పేపర్లు, ఛానళ్లు చూసే పరిస్థితి ఉండదన్నారు.