త్వరలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ పలు కీలక సూచనలు చేసింది. జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని టీటీడీ వెల్లడించింది. భక్తులకు కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులు తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కోరారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు.
అధికారులకు దిశానిర్దేశం
వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని ఆదేశించారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అందుబాటులో లడ్డూలు
భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని అన్నారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలన్నారు.