వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని గోడౌన్ లో భారీ మొత్తంలో బియ్యం మాయం అయినట్లు తెలుస్తోంది. ముందు వెయ్యి బస్తాలు పోయినట్లు, ఆ తర్వాత 3-4 వేల బస్తాలంటూ భావించినా ఇప్పుడు ఏకంగా 7577 బస్తాల రేషన్ బియ్యం పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ నుంచి మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ బియ్ం కాకినాడ పోర్టు నుంచి దేశం దాటేసినట్లు టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు.
ఏకంగా 7577 బస్తాలు మాయం?
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన పేర్నినాని భార్య పేర్ని జయసుధ రేషన్ డీలర్ గా ఉండేవారు. ప్రభుత్వం నుంచి తమకు పంపిణీ కోసం అందిన బియ్యాన్ని తమ కుటుంబానికి చెందిన గోడౌన్ లో భద్రపరిచేవారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారం మారింది.. ఆ తర్వాత అదే గోడౌన్ లో ఉండాల్సిన భారీ బియ్యం నిల్వలు మాయం అయినట్లు జయసుధ ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేర్ని వారి గోడౌన్ లో మాయమైన రేషన్ బియ్యంపై పౌరసరఫరాలశాఖ , రెవెన్యూ శాఖ, పోలీసులు ఫోకస్ పెట్టారు. డిసెంబర్ 10న కేసు నమోదు చేసినా బియ్యం ఎంత మాయమైందనే విషయం మాత్రం కనుక్కోలేకపోయారు. దీంతో ఓసారి వెయ్యి బస్తాలేనని, మరోసారి మూడు వేల బస్తాలని చెప్పారు. ఇప్పుడు ఏకంగా 7577 బస్తాలు మాయమైనట్లు తుది లెక్క తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న పేర్ని కుటుంబ సభ్యుల్ని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. దీంతో వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై నాని ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి. ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నది.