Headlines
roja

ప్రజల కారణంగా వైసీపీ ఓడిపోలేదు: రోజా

ప్రజల కారణంగా వైసీపీ ఓడిపోలేదని… కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు… అప్పులపై అప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు నగరిలో వైసీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని రోజా విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు.
జగన్ ఓడిపోయినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయని తెలిపారు. వైసీపీ హయాంలో స్కూళ్లను జగన్ అద్భుతంగా తీర్చిదిద్దారని… కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
వాళ్లంతా ఇప్పుడు బాధపడుతున్నారు
జగన్ ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారని… చంద్రబాబును ఎందుకు గెలిపించామా? అని ఇప్పుడు వాళ్లంతా బాధపడుతున్నారని అన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పం సహా అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ క్యాడర్ ను ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో… వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. పచ్చ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *