న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. “భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది.
‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి” అని ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నేటి ఉదయం వాజపేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్‌ఘాట్‌లోని వాజపేయి మెమోరియల్ వద్ద చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీపై ఇంకా స్పష్టత రాలేదు.