Headlines
We will build the capital without burdening the people.. Minister Narayana

ప్రజలపై భారం వేయకుండా రాజధాని నిర్మిస్తాం : మంత్రి నారాయణ

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణంపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని పునరుద్ఘాటించిన ఆయన .. ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతిని నిర్మిస్తామని తెలిపారు.

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి తీసుకునే రుణాలను అమరావతిలో భూములు విక్రయించడంతో పాటు భవిష్యత్తులో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని పనులు పునః ప్రారంభించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అమరావతిపై విమర్శలు చేస్తున్నారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తూనే రాష్ట్రంలోని 26 జిల్లాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర నలుమూలలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా రాజధానిలో మరో 2,723.02 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని అన్నారు. జనవరి 15 లోగా రాజధానిలో మొత్తం పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. మూడేళ్లలో రాజధానిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *