ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం మొదలైన ప్రకంపనలు ఆదివారం, సోమవారం వరకు కొనసాగాయి. సోమవారం ఉదయం 10.24 గంటలకు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 1.8గా నమోదైంది. రాత్రి మరో రెండు సార్లు భూకంపాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపాల తీవ్రత వల్ల ముండ్లమూరు మోడల్ స్కూల్ భవనం పాక్షికంగా దెబ్బతింది. భవనం భద్రంగా లేదని విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో స్కూల్ టీచర్లు చెట్ల కింద తరగతులను నిర్వహిస్తున్నారు. ఇలా వరుస భూకంపాలపై శాస్త్రవేత్త రాఘవన్ మాట్లాడుతూ.. వరుస భూకంపాలపై పరిశోధనలు అవసరమని సూచించారు. ముండ్లమూరు ప్రాంతంలో భూప్రకంపనలు హైడ్రోశాస్మసిటీ కారణంగా వచ్చిన అవకాశముందని తెలిపారు. రిజర్వాయర్లు, గుండ్లకమ్మ నది వంటి ప్రాంతాల్లో లోతైన అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.
తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కలెక్టరేట్‌కు నివేదికలు పంపించామని, ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.