Headlines
Big accident at Visakha rai

విశాఖ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. స్టేషన్‌లోకి వచ్చిన రైలు ఇంజిన్ హైటెన్షన్ విద్యుత్ తీగలు కొంతదూరం ఈడ్చుకెళ్లడం కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే, సిబ్బంది సమయస్ఫూర్తితో విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు వెళ్తున్న రైలు (22606) ఉదయం 5.20 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకుంది. కోల్‌కతా వైపు వెళ్లేందుకు రైలు ఇంజిన్ మార్చే పనులు జరుగుతున్న సమయంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైనున్న విద్యుత్ తీగలను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనతో రైలు రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది.

రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఇంజిన్ నిర్వహణలో ఏవైనా పొరపాట్లు జరిగాయా, లేదా ఇతర సాంకేతిక లోపాల వల్ల ఈ సంఘటన జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ లక్ష్యమని వారు తెలిపారు. ఈ ఘటన తరువాత రంగంలోకి దిగిన సిబ్బంది విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *