Headlines
sharmila

ఫ్రీ బస్‌పై చిత్తశుద్ధి లేదు : వైఎస్‌ షర్మిల

మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని ట్విట్టర్‌ వేదిక ద్వారా విమర్శించారు.
అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికోసమని నిలదీశారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ? మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ అమలు అయినపుడు ఇక్కడ ఎందుకు కావడం లేదని ఆమె ప్రశ్నించారు.

మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పేర్కొన్నారు. కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *