Headlines
daikin

ఏపీలో డైకిన్ కర్మాగారం ఏర్పాటు

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు చొరవతో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ డైకిన్ ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించింది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ కంపెనీ భాగస్వామ్యంతో శ్రీసిటీలో కంప్రెసర్ల తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది.
ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్
దాదాపు 75 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్ గా అవతరిస్తుందని పేర్కొంది. ఇన్వర్టర్, నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను ఇక్కడ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.
రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉంటుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేయబోయే యూనిట్ తో కలిపి భారత్ లో మొత్తం మూడు యూనిట్లు నెలకొల్పినట్లు అవుతుందని డైకిన్ కంపెనీ వివరించింది. ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లతో కలిపి ఏటా 2 మిలియన్ కంప్రెసర్లను తయారుచేస్తున్నామని, 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంతో దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యమవుతుందని, భారత మార్కెట్లో ఏసీ విక్రయాల్లో టాపర్ గా నిలవాలన్నదే తమ లక్ష్యమని డైకిన్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనితో యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *