ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి గణితం ప్రశ్న పత్రం లీక్ కావడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ ప్రశ్న పత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీక్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పేపర్ లీక్ ఘటనను గమనించిన పాఠశాల విద్యాశాఖ వెంటనే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 6-10 తరగతుల విద్యార్థులకు నిన్న జరగాల్సిన సమ్మేటివ్ అసెస్మెంట్-1 గణిత పరీక్షను డిసెంబర్ 20కు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మిగతా సబ్జెక్టుల పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పేపర్ లీక్ ప్రభావం పాఠశాల విద్యార్థులపై పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
పేపర్ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పేపర్ ఎలా లీక్ అయింది, ఎవరు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నారనేది తెలుసుకునేందుకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి ఘటనలు పాఠశాల విద్యపై ప్రతికూల ప్రభావం చూపుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ కారణంగా పరీక్షా వ్యవస్థ పట్ల నమ్మకం దెబ్బతింటుందని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు.