తిరుమల: రేపు (బుధవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2025 మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వీటిలోనే లక్కీ డిప్ కోటా కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనుంది.
కాగా, డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, ఉదయం 11 గంటలకు శ్రీ వాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను విడుదల చేస్తుంది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మార్చి 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదులను ముందస్తుగా బుక్‌చేసుకోవచ్చు. ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inలో భక్తులు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.