ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి భయం వీడడం లేదు. తాజాగా బజార్హాత్నూర్ మండలంలో చిరుతపులి దాడి జరిగింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
చిరుతపులి దాడి సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులను చూసి చిరుత భయపడి పారిపోయింది. ఈ ఘటన తర్వాత గ్రామస్థులందరూ భయంతో ఉన్నారు. అటవీ ప్రాంతం సమీపంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారికీ నిద్రపట్టడం లేదు. గ్రామస్తులు ఈ సమస్యను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చర్యలు తీసుకుని చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు కొన్ని సూచనలు చేశారు. ఒంటరిగా బయలుదేరొద్దని, బయటికి వెళ్లేటప్పుడు కర్ర లేదా ఆయుధాన్ని వెంట తీసుకెళ్లాలని సూచించారు. చిరుత పులుల హడావిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు.