హైదరాబాద్: తెలంగాణ మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ ప్రభుత్వం లో కండీషన్ లు పెట్టి ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదని గత ప్రభుత్వం లో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 4.50 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని పేర్కొన్నారు.
ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తామని ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లు నిర్మిస్తామన్నారు. సంక్రాంతి నాటికి కూసుమంచి లో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారని వివరించారు.
కాగా, అర్హులైన లబ్దిదారులు 400 చదరపు అడుగుల్లో కొత్త ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుందని గతంలోనే మంత్రి వెల్లడించారు. అందులోనూ స్నానాల గది, వంట గది తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుంది. మెుత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్ములు లబ్ధిదారులకు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే రూ. లక్ష, లెంటల్ లెవల్‌కు చేరగానే మరో రూ.1.25 లక్షలు, స్లాబు వేశాక మరో రూ. 1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన లక్ష ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని చెప్పారు.