Headlines
Rajahmundry to Delhi.. Start of flight service

రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు

రాజమండ్రి: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌లు ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ పరిణామానికి ముందు, ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి తొలి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. ఈ తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుండి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు. రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్‌బస్‌కు స్వాగతంగా వాటర్ కెనాల్స్‌తో సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రాజమహేంద్రవరం విమానాశ్రయం నుండి ఇటీవల ముంబయికి కూడా నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఇక ఈ ఫ్లైట్ ఉదయం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి ఏపీకి.. 9.30 ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… రాజమండ్రి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఏపీలో అన్ని ఎయిర్ పోర్టుల నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు ఏటీఆర్ విమాన సర్వీసులు మాత్రమే ఉండగా ఇప్పుడు ఎయిర్ బస్‌లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. మరో 50 ఎయిర్ పోర్టులు కొత్తగా నిర్మించాలని భావిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఢిల్లీ, తిరుపతి, వారాణసీ, షిర్డీ తదితర ప్రదేశాలకు మధురపూడి నుంచి కనెక్టివిటీ సర్వీసులు కలపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. త్వరలోనే ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నామని కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

మరోవైపు రాజమహేంద్రవరం నుంచే దేశవ్యాప్త రాకపోకలకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధికి రూ.250కోట్లు కేటాయించారు. దీంతో విమానాశ్రయ రూపురేఖలు మారిపోనున్నాయి. పనులు పూర్తయ్యేలోపు రాకపోకలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎక్కడికైనా ఇక్కడి నుంచి వెళ్లేలా విమానాశ్రయాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకూ 72 సీట్లతో విమానాలు నడుస్తున్నాయి. ఇక డిసెంబర్ 1 నుంచి 180 సీట్లు ఉన్న ఎయిర్‌బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటివరకూ రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు రోజూ అటూ ఇటూ 14 సర్వీసులు తిరుగుతున్నాయి. బెంగళూరుకు అటూ 4 సర్వీసులు ఉన్నాయి. చెన్నైకు ఒకసారి విమాన సర్వీసు వెళ్లి వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *