సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టు రంజిత్‌పై చేసిన దాడిని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే చర్యగా ఉందని హెచ్‌యూజే పేర్కొంది. పాత్రికేయులు సమాజానికి నిజాలను అందించేందుకు కృషి చేస్తారని, వారి ప్రాధాన్యతను అర్ధం చేసుకోవాలని హెచ్‌యూజే అధ్యక్షులు బి. అరుణ్ కుమార్ అన్నారు. పత్రికా రంగానికి ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర ఉందని హెచ్‌యూజే కార్యదర్శి బి. జగదీశ్వర్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులపై ఇటువంటి దాడులు జరగడం అనాగరికంగా ఉందన్నారు. మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఉందని పేర్కొన్నారు.
మోహన్ బాబు తన చర్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హెచ్‌యూజే డిమాండ్ చేసింది. ఈ ఘటనపై తక్షణమే కేసు నమోదు చేయాలని, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరింది. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్‌లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని హెచ్‌యూజే సూచించింది. పాత్రికేయుల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని హెచ్‌యూజే స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఇది తప్పనిసరని వివరించింది.