ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించనున్న కారణంగా అక్కడి విద్యార్థులు, అధికారుల్లో ఆనందం నెలకొంది.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, సిబ్బంది కలిసి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి సభలో పాల్గొనే విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. ప్రధానంగా భద్రతా పరంగా ఎటువంటి లోపం లేకుండా చూడాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారులోని రాష్ట్రపతిభవన్లో బస చేయనున్నారు. అక్కడి నుండి మంగళగిరి ఎయిమ్స్ పర్యటనకు బయలుదేరి, స్నాతకోత్సవంలో పాల్గొని తిరిగి రాష్ట్రపతిభవనానికి చేరుకోనున్నారు.
రాష్ట్రపతి పర్యటన రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించనుంది. ఇది మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రి సేవలు అందిస్తున్న ఎయిమ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సందేశం ఓ ప్రేరణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.