అన్నమయ్య జిల్లా రాయచోటి జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు తమ ఉపాధ్యాయుడిని దాడి చేసి హత్య చేసిన కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పాఠం చెప్పేటపుడు అల్లరి చేసిన విద్యార్థులను ఉపాధ్యాయుడు మందలించడంతో కోపంతో వారు అతనిపై దాడి చేసినట్టు సమాచారం. గురువారం పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో, విద్యార్థులు ఉపాధ్యాయుడి ఛాతీపై తీవ్రంగా దాడి చేశారు. గాయపడిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
దాడి అనంతరం ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుడు తన విధులను నిర్వహిస్తుండగా ఈ విధమైన దాడి జరగడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు ఈ కేసులో ఇద్దరు మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి వయసు దృష్ట్యా జువెనైల్ హోమ్‌కు తరలించారు. కేసు విచారణ కొనసాగుతుండగా, నిందితుల కుటుంబాలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.