Headlines
jagan tour

శ్రీకాకుళం నుండి జగన్ జిల్లా పర్యటనల శ్రీకారం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి జనవరి నుండి జిల్లా పర్యటనలు ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటిస్తూ ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనల కోసం క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నాయకులతో కీలక భేటీ జరిపారు.

జగన్ తన పర్యటనల దృష్ట్యా కేడర్‌లో జోష్ నింపుతూ, ప్రతీ గ్రామ స్థాయి నేతలతో సమన్వయం కుదర్చే దిశగా పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నాయకత్వాన్ని నడిపించడమే లక్ష్యంగా అనేక సూచనలు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపునిస్తానని జగన్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేతగానితనం ప్రజల్ని తీవ్ర నిరాశలోకి నెట్టిందని జగన్ విమర్శించారు. సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, రైతుల కష్టాలు పెరిగిపోవడం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి వెళతానని తెలిపారు. గత ప్రభుత్వ హామీలను అమలు చేసి ప్రజలకు నమ్మకం ఇచ్చామని, ఇప్పుడు ప్రజల కోసం కేడర్ మరోసారి కదలాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా నేతలు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, పిరియా విజయ్, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. ధర్మాన ప్రసాదరావు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ కొన్ని సెటైర్లు వేయడం గమనార్హం. ఇకపై ప్రతి కార్యకర్త సోషల్ మీడియా వేదికను ఉపయోగించి పార్టీ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పరిపాలనలో వైసీపీ ప్రభుత్వ ధోరణి, బడ్జెట్ క్రమశిక్షణ, సంక్షేమ పథకాలు అన్నీ ప్రజలు గుర్తుంచుకుంటారని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్‌లో సింగిల్ డిజిట్‌కు పడిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ పర్యటనల ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుస్తానని జగన్ సంకల్పం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *