ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. తొలి రోజే రూ.280 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం, అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని థియేటర్లపై అధికారుల చర్యలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో థియేటర్లు సీజ్ చేయడం, అభిమానుల్లో ఆగ్రహం రేపుతోంది.
కుప్పంలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న లక్ష్మీ, మహాలక్ష్మీ థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టించింది. టీడీపీ సీనియర్ నేతకు చెందిన ఈ థియేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, థియేటర్ల యాజమాన్యం లైసెన్సు రెన్యూవల్ చేయకపోవడం, ఎన్‌ఓసీ లేకుండా ప్రదర్శనలు కొనసాగించడం కారణంగానే చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయానికి హాని కలిగించే థియేటర్లను ఉపేక్షించబోమని, అన్ని అనుమతులు తీసుకుని మాత్రమే థియేటర్లు నడుపాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న తనిఖీలలో పర్మిషన్ల లేమి ఉన్న థియేటర్లపై చర్యలు తీసుకోవడం కొత్త కాదు. కానీ, విజయవంతమైన చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని థియేటర్లను సీజ్ చేయడం అన్యాయమని అభిమానులు ఆరోపిస్తున్నారు. పుష్ప 2 ప్రదర్శనకు ఆటంకం కలిగించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.