విశాఖపట్నం : ఇప్పటికే 1,066 కేసులు పెట్టామని, 729 మందిని అరెస్టు చేశామని, 102 వాహనాలను సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆదేశించారు. రూ.240 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసి, కేసును సీఐడీ విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా విలేకరులతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో రేషన్ బియ్యం తరలింపుపై దృష్టి సారించామని, మాఫియాపై ఉక్కుపాదం మోపతున్నామని దానిలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టి, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,066 కేసులు నమోదు చేశామని, 729 మందిని అరెస్టు చేశామని, పట్టుబడిన 102 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న 62వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని వివరించారు. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రేషన్ మాఫియా చేసే అక్రమాల తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సీబీ-సీఐడీ విచారణకు ఉపక్రమించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు రేషన్ అక్రమ రవాణా, తరలింపుపై గట్టి నిఘా ఉంచామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు గురువారం విశాఖపట్టణం వచ్చిన ఆయన కలెక్టరేట్ మీటింగు హాలులో విలేకరులతో మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ వ్యవహారాలపై ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు.
విలేకరుల సమావేశంలో భాగంగా మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. “రేషన్ బియ్యం అక్రమ రవాణా, తరలింపుపై గట్టి నిఘా పెట్టాం. బియ్యం డైవర్షన్ జరగ్గకూడదనే తపనతో పని చేశాం. దానిలో భాగంగా జూన్ 28న కాకినాడలో 13 గోదాములపై దాడులు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చశాం. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న బియ్యం రవాణా అక్రమ వ్యవహారాలపై స్పష్టత వచ్చింది. స్టెల్లా నౌక నుంచి రేషన్ బియ్యం తరలిపోతుందనే సమాచారంతో కలెక్టర్, ఇతర అధికారులను పంపించాం. ఆ సంఘటన తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ప్రక్షాళన చేయాలనే తపిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్య వైఖరి కనిపించింది. గ్రీన్ ఛానెల్ ద్వారా మాఫియాకు సహకరించారు. ఇటీవల కాకినాడ పోర్టులో జరిగిన ఘటనల క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీబీ-సీఐడీ వేశారు. ఇది అందరూ హర్షించదగ్గ విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలనలో మార్పు రావాలనే తపనతో మేం చేస్తున్న కృషికి ఫలితంగా ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వేసిన ఈ సీబీ-సీఐడీ విచారణ దానికి దోహదపడుతుందని నమ్ముతున్నాం. మా శాఖ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యావాదాలు తెలుపుతున్నాం. సహకరిస్తాం. కూటమి సర్కారు వచ్చిన తర్వాత చేసిన తనిఖీల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. గత మూడేళ్లలో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యింది. అక్కడ స్మగ్లింగ్ డెన్ గా తయారు చేసుకొని రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా కృషి చేస్తాం. జర్నలిస్టులు కూడా సహాయం అందించాలి. రైస్ మిల్లర్లు ప్రభుత్వంతో పాటు కలిసి పని చేయాలి. నిజాయితీగా, పారదర్శకంగా వ్యాపారం చేసుకోవాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వ్యవహరించాలని విన్నవిస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తం చేసేందుకు గాను విశాఖపట్టణం వేదికగా ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాం.