Headlines
CM Revanth is ready to visit Davos

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ముందు వీరికే ప్రాధాన్యం – సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అవినీతి, రాజకీయ ప్రయోజనాలకు ఇందులో చోటు లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
గ్రామసభల ద్వారా అర్హుల ఎంపిక చేయడం, AI సాయం ద్వారా లబ్ధిదారుల గుర్తింపు వంటి చర్యలతో పథకం న్యాయంగా అమలవుతుందని సీఎం వివరించారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు.

పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ చెప్పారు. ఇందిరాగాంధీ ప్రారంభించిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా బడుగు వర్గాలకు గౌరవం దక్కిందని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అంతేకాక, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవించడం ప్రతీ రాజకీయ నాయకుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని, అందరికీ సహకారం కావాలని కోరారు. పాలకులు, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు సభకు హాజరై ప్రజల కోణంలో పాలకపక్షాన్ని ప్రశ్నించాలని సూచించారు. చిన్నపిల్లల మానసికతతో వ్యవహరించడం రాష్ట్రానికి మంచిది కాదని, సమన్వయం అవసరమని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *