న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు కూడా విపక్షాలు ఆందోళనకు దిగారు. గౌతమ్ అదానీ వ్యవహారంపై చర్చకు ఇండియా కూటమి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. ఉదయం సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలు.. నిరసన తెలిపారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు. ఫ్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ వారు ఆందోళన కొనసాగించారు.
మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంపై లోక్సభలో ఈ నెల 13, 14 తేదీల్లోనూ, రాజ్యసభలో ఈ నెల 16, 17 తేదీల్లోనూ చర్చించేందుకు అంగీకారం కుదిరింది. పార్లమెంటు కార్యకలాపాలు మంగళవారం నుంచి సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, సంభల్ హింసాకాండ, మణిపూర్ అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండటంతో పార్లమెంట్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.