న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారం, యూపీలోని సంభల్ హింసాకాండపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడ్డాయి. విపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు ఎగువ సభ లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య చైర్మన్ ధన్‌ఖర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, శుక్రవారం కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభ ఉదయం 11.00 గంటలకు ప్రారంభం కాగానే నిమిషాల వ్యవధిలో వాయిదా పడింది. అదానీ స్కాం, మణిపూర్, సంభాల్ హింసాకాండ, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పూజారి అరెస్టుపై చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన 17 నోటీసులను చైర్మన్ తిరస్కరించారు. అనంతరం సభను (డిసెంబర్ 2) సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. లోక్‌సభలో అదానీ స్కాంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపి మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్య ”ప్రజా ప్రాముఖ్యత”, మరియు ”భారత పాలన, నియంత్రణ చట్టాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది” అని తీర్మానంలో పేర్కొన్నారు. సభను స్పీకర్ మధ్యాహ్నం 12.00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.