న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం గినియాలో విషాదం చోటుచేసుకున్నది. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో 100 మందికిపైగా మరణించారు. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయంతో వివాదం తలెత్తింది. దాన్ని వ్యతిరేకించేందుకు ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి టీమ్ అభిమానులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది. వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు.
దీంతో వంద మందికిపైగా మరణించగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ ఘర్షణ అంతకంతకూ విస్తరించి.. వేలాది మంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చారు. ఎదుటి జట్టు అభిమానులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆట మీద అభిమానం ఉండొచ్చు. మరీ ఇంతనా? అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం వంద మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.