ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లకు వరుస షాకులు తగ్గడం లేదు. వాలంటీర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టుగా నిలిచి, కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చెయ్యడంతో.. ఇప్పుడు వాలంటీర్ల పట్ల కూటమి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. వారిని వాలంటీర్లుగా కాకుండా.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోయింది. దాంతో వాలంటీర్ల కెరీర్ గందరగోళంలో పడింది.
5 నెలలుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ. 10 వేల జీతం పెంచాలని ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు మరో పెద్ద షాక్ తగిలింది. గ్రామ అవార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్ లో వాలంటీర్లు హాజరు వేసుకునేటువంటి ఆప్షన్ను… తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇకపై వాళ్లు హాజరు వేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా…. మంత్రి వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థలో తాము లేమని ప్రకటించడంతో మొబైల్ యాప్ లో హాజరు వేసుకునే ఆప్షన్ ను తొలగించారట. దీంతో ఏపీ వాలంటీర్లు రోడ్డున పడినట్లు అయింది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందని.. ఇటీవల ఏపీ శాసనమండలిలో మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అసలు వాలంటీర్ వ్యవస్థే ఏపీలో లేదన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చెయ్యలేదని తెలిపారు. 2023 సెప్టెంబర్‌తోనే వాలంటీర్ వ్యవస్థకు గడువు కాలం ముగిసిందన్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించకపోవడం వల్ల.. అప్పటి నుంచి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదన్నారు. అందుకే వాలంటీర్లకు జీతాలు ఇవ్వట్లేదు అన్నారు.