జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలని పవన్ కళ్యాణ్..NDA ను కోరినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్, ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏ పెద్దలతో ఈ విషయాన్ని ప్రస్తావించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి స్థానంలో నాగబాబు పోటీపడాలని అనుకుంటున్నప్పటికీ, ఈ స్థానం బీజేపీకి కేటాయించబడింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాగబాబును రాజ్యసభకు పంపించాలని భావించారని సమాచారం.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీతో సమన్వయాన్ని కాంక్షిస్తూ, పార్టీ మధ్య సంయుక్త ఆలోచనలు నిర్వహిస్తున్నారు. జనసేనతో బీజేపీ మిత్ర సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటె రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ గా గడుపుతూ వచ్చారు. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబదించిన పలు విషయాలను ప్రస్తావించారు. అలాగే మోడీ తో కూడా భేటీ అయ్యారు. ఇక నిన్న రాత్రి తెలంగాణ , ఏపీ ఎంపీలతో పాటు పలువురు బిజెపి ఇతర రాష్ట్రాల ఎంపీలకు విందు ఏర్పాటు చేసారు.