హైదరాబాద్ : గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనల నేపథ్యంలో ఈనెల 30 నుండి డిసెంబర్ ఏడో తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున “గురుకుల బాట” కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గురుకులాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో 11 నెలల్లోనే 48 మంది విద్యార్థులు మృతిచెందారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను పరిశీలిస్తామన్నారు. గురుకుల బాటలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొంటారని తెలిపారు. బాలికల విద్యాసంస్థలను మహిళ నాయకులు, మహిళ ప్రజాప్రతినిధులు సందర్శిస్తారని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల్లో గురుకులాల్లో దుర్భరమైన పరిస్థితులు తట్టుకోలేక 23 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఎనిమిది మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, నలుగురు విషాహారం తిని, 13 మంది అనారోగ్యంతో చనిపోయారని.. మొత్తంగా 48 మంది చనిపోయారని తెలిపారు. ఇప్పటి వరకు 38 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్నారు. 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారని తెలిపారు. వాంకిడిలో విషాహారం తిని శైలజ చనిపోయిన ఘటన మరవకముందే మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగటం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవటం, కీలకమైన విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తుండటం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. మొదటి సంఘటన జరిగినప్పుడే సీఎం స్పందించి ఉంటే ఇంత మంది విద్యార్థుల ప్రాణాలు పోయి ఉండేవి కాదన్నారు.
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి పిల్లల తల్లితండ్రులు కడుపుకోత కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి 28 సార్లు వెళ్లటానికి సమయం ఉంది కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చనిపోతుంటే కనీసం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయి లేదా అని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరితే బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ప్రజాపాలన కాదు.. విద్యార్థులను పొట్ట పెట్టుకుంటున్న పాపపు పాలన అని మండిపడ్డారు. విద్యార్థుల చావులను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందన్నారు. ఈ ప్రభుత్వం గురుకుల, పాఠశాల విద్యను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదవుకు దూరం చేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వరుస సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లైనా లేదా అని ప్రశ్నించారు.