హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తికావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్ గా బీజేపీ ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్లను ప్రదర్శించనుంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2వేల మందితో నిరసన సభలు ఏర్పాటు చేయనుంది. కాగా, 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్, డిసెంబర్ 1న జిల్లాస్థాయిలో బీజేపీ ఛార్జిషీట్, డిసెంబర్ 2, 3 తేదీల్లో నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.
మరోవైపు ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్న సందర్భంగా 28, 29, 30 తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందున ఆ సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.